తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన 'సాగరం సంగమం' విడుదలై నేటికి సరిగ్గా 40 వసంతాలు. గొప్ప నటులు కమల హాసన్, జయప్రద ప్రధాన పాత్రలు ధరించిన ఈ క్లాసిక్ మూవీని దిగ్దర్శకులు కె. విశ్వనాథ్ రూపొందించారు. ఆ ముగ్గురితో పాటు, చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు ఈ సినిమా ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్నీ సాధించిపెట్టింది. చూసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం మనకు తెలియజేసే సినిమా 'సాగర సంగమం'.
నాట్యాన్ని ప్రాణప్రదంగా భావించే బాలకృష్ణ, ఆ నాట్యాన్ని ప్రేమించే మాధవి కథ ఈ సినిమా. మాధవిని ప్రేమించిన బాలకృష్ణ, అప్పటికే ఆమె వివాహిత అనీ, ఆస్తి వివాదాల కారణంగా అతడికి దూరంగా ఉంటోందని తెలిసి, ఆ ఇద్దర్నీ కలిపి, తాను దూరంగా వెళ్లిపోతాడు. కొన్నేళ్ల తర్వాత 'నాట్యమయూరి' బిరుదు ప్రదాన సభలో శైలజ నాట్యంలోని లోపాలను ఎత్తిచూపుతాడు. అప్పుడే ఆమె మాధవి కూతురనే విషయం తెలుస్తుంది. దాంతోపాటే మాధవి వితంతువుగా మారిందనే విషయమూ తెలిసి తట్టుకోలేకపోతాడు. శైలజను తన వారసురాల్ని చెయ్యాలనే తపనతో ఆమెకు నాట్యం నేర్పించి, ఆమె ప్రదర్శన చూసి తృప్తిగా తనువు చాలిస్తాడు.
కథానాయకుడు బాలకృష్ణ ఎక్కువ భాగం ముసలివాడిగా కనిపించాలి కాబట్టి మొదట ఆ పాత్రను చెయ్యడానికి కమల్ హాసన్ ఇష్టపడలేదు. ఐదారు నెలలు ఆయన వెంటపడి మొత్తానికి ఆయన చేత సరేననిపించారు ఏడిద నాగేశ్వరరావు. మాధవి పాత్రకు మొదట జయసుధను అనుకొని, ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, జయప్రదను తీసుకున్నారు. శైలజ పాత్రకు నాట్యం తెలిసిన కొత్తమ్మాయి అయితే బాగుంటుందని అనుకొని, అప్పుడే డాన్స్ నేర్చుకుంటున్న ఎస్పీ శైలజను ఎంపిక చేశారు. సంగీత దర్శకుడిగా కె.వి. మహదేవన్‌ని అనుకున్నారు కె. విశ్వనాథ్. అయితే ఏడిద నాగేశ్వరరావు సలహాతో ఇళయరాజాను తీసుకున్నారు. అన్ని పాటల్నీ వేటూరి రాశారు. మ్యూజికల్‌గానూ ఈ సినిమా పెద్ద హిట్. కమల్ హాసన్ బాగా మద్యం తాగి, మత్తులో ఓ బావిపై అడ్డంగా ఉన్న పంపుగొట్టమీద డాన్స్ చేస్తూ "తకిట తకిట తందాన.." పాటను పాడుతూ ఉంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే "వేదం.. అణువణువున నాదం.." పాటలో కాలికి గాయంతోటే డాన్స్ చేశారు కమల్.
సుమారు రూ. 30 లక్షల వ్యయంతో ఈ సినిమాని నిర్మించారు. అందులో కమల్ పారితోషికం రూ. 4 లక్షలు. 75 పని దినాల్లో మద్రాస్, ఊటీ, వైజాగ్, హైదరాబాద్ లోకేషన్స్‌లో షూటింగ్ జరిపారు. కమల్ కాస్ట్యూమ్స్‌ను అప్పటి ఆయన భార్య వాణీ గణపతి డిజైన్ చేశారు. శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్‌కుమార్‌కు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పడం విశేషం. జయప్రద భర్త వేణుగోపాలరావు పాత్రను నటి లక్ష్మి మాజీ భర్త మోహన్ శర్మ చేశారు. ఆయనకు ఎస్పీ బాలు డబ్బింగ్ చెప్పారు. 1983 జూన్ 3న విడుదలైన 'సాగరసంగమం' ఘన విజయం సాధించింది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళం (సలంగై ఒలి)లో 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. బెంగళూరు, మైసూరులో ఒకటిన్నర సంవత్సరం పాటు ఆడటం విశేషం. రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమా 'సాగరసంగమం'.
ఇళయరాజాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఎస్పీ బాలుకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకునిగా పురస్కారాలు అందించింది ఈ చిత్రం. కమల్ హాసన్ ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు. అవార్డులు రాకపోయినా నటిగా జయప్రదకు చాలా మంచి పేరు వచ్చింది. జంధ్యాల రాసిన సంభాషణలు ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.
కమల్ స్నేహితుడు రఘుగా శరత్‌బాబు నటించిన ఈ సినిమాలో సాక్షి రంగారావు (బాబాయ్), వంకాయల సత్యనారాయణ (డాక్టర్ మూర్తి), మిశ్రో (డాన్స్ డైరెక్టర్ చిత్తరంజన్), ధం (ఇంటి ఓనర్), పొట్టి ప్రసాద్ (శివయ్య), మాస్టర్ చక్రవర్తి (చక్రి), ఇతర పాత్రలు చేశారు. పి.ఎస్. నివాస్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, జి.జి. కృష్ణారావు ఎడిటింగ్ కూడా 'సాగరసంగమం' క్లాసిక్‌గా రూపొందడంలో తమ వంతు పాత్రలు పోషించాయి.
- బుద్ధి యజ్ఞమూర్తి